సర్వే చేస్తాం... తేడాగా ఉన్నవాళ్లను వదిలించుకుంటాం: క్యాడర్ కు చంద్రబాబు క్లారిటీ

  • పనితీరు ఆధారంగానే పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టీకరణ
  • తప్పులు చేసేవారిని వదిలించుకుంటానని హెచ్చరిక
  • డీఎస్సీపై ‘గొడ్డలి పార్టీ’ దుష్ప్రచారాన్ని ఆధారాలతో తిప్పికొట్టామన్న ముఖ్యమంత్రి
  • లోకేష్ పట్టుదలతో పనిచేసి మంగళగిరిని టీడీపీకి కంచుకోటగా మార్చారని ప్రశంస
  • ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచన
తెలుగుదేశం పార్టీలో ఇకపై పనితీరే ప్రామాణికమని, తప్పులు చేసే వారిని, తేడాగా వ్యవహరించే వారిని వదిలించుకుంటానని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పార్టీ పదవుల నుంచి ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు వరకు నిరంతరం సర్వేలు చేయిస్తానని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ఇకపై పార్టీకి ఓటమి లేదు, రాదు. ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలతో మంచిగా ఉంటున్నాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం, సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్నాం. అన్నింటికీ మించి ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. అందుకే ఓటమి మన దరికి చేరదు. రాష్ట్రం, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వారిని, తేడాగా ఉన్నవారిని వదిలించుకోవడానికి వెనుకాడను" అని స్పష్టం చేశారు.

గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచిస్తూ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపారు. "మంగళగిరిలో పార్టీ గెలిచి చాలా కాలమైంది. 2019లో లోకేష్ ఓడినా పట్టు వదలకుండా పనిచేసి, 2024లో అద్భుత విజయం సాధించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చారు. అందరూ లోకేష్‌లా పనిచేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. మంచి సంకల్పంతో పనిచేస్తే దానికి తగ్గ వాతావరణం దానంతట అదే ఏర్పడుతుందని, 'ది సీక్రెట్' పుస్తకాన్ని ప్రతి కార్యకర్తా చదవాలని సూచించారు.

‘గొడ్డలి పార్టీ’ చేతులెత్తేసింది
గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "మద్యపానం నిషేధం, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలిచ్చి ‘గొడ్డలి పార్టీ’ చేతులెత్తేసింది. వారు చెప్పినవి చేయకపోగా, మేం నిర్వహిస్తున్న డీఎస్సీ-2025పై బురదజల్లారు. వివేకా హత్య విషయంలో ఎలా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారో, డీఎస్సీ విషయంలోనూ అదే ప్రయత్నం చేశారు. కానీ మేం ఆధారాలతో సహా కౌంటర్ ఇవ్వడంతో వారు డిఫెన్స్‌లో పడ్డారు. ఫేక్ రాజకీయాలు చేయడమే గొడ్డలి పార్టీ సిద్ధాంతం" అని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నందున సహనంతో ఉంటామని, అయితే ప్రతిపక్షం ఆగడాలు శ్రుతి మించితే సహించేది లేదని హెచ్చరించారు.

కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. "కూటమిగా వెళ్లాం కాబట్టే 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిచాం. ఓట్లు చీలకూడదనే బీజేపీతో పొత్తులో ఉన్నా టీడీపీతో కలుస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కొనసాగించాలి" అని సూచించారు.

"యుద్ధాన్ని గెలిపించే బాధ్యత నాది, నాతో పాటు అలుపెరగకుండా యుద్ధం చేసే బాధ్యత మీది. రాష్ట్రంలోని ప్రతి బూత్‌లో గతానికి మించి ఓట్లు రావాలి" అని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గడప గడపకు వెళ్లి వివరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ప్రజలకు గుర్తు చేయాలని ఆదేశించారు.

Chandrababu Naidu
TDP
Andhra Pradesh Politics
Nara Lokesh
Pawan Kalyan
Election Surveys
YSRCP
Mangalagiri
TDP Alliance
AP CM

More Telugu News